Business
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో రూ.50 లక్షల అటాచ్మెంట్ అంశంపై అప్పిలేట్ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ చేసిన రూ.50 లక్షల అటాచ్మెంట్ను ధ్రువీకరిస్తూ 2022లో ఇచ్చిన ఆదేశాలను ట్రైబ్యునల్ రద్దు చేసింది. ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకున్న అసలు రూ.50 లక్షలు ట్రయల్ కోర్టు వద్ద భద్రంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో అదే మొత్తాన్ని మళ్లీ అటాచ్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తో పాటు మరో ముగ్గురికి కూడా ట్రైబ్యునల్ నుంచి భారీ ఊరట లభించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఎస్ఏఎఫ్ఈఎమ్ఏ (స్మగ్లర్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మ్యానిప్యులేటర్స్) పరిధిలోని అప్పిలేట్ ట్రైబ్యునల్ ఈనెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేవంత్ రెడ్డి, వేమ్ కృష్ణ కీర్తన్, రుద్ర శివకుమార్ ఉదయ్ సింహ, బిషప్ హ్యారీ సెబాస్టియన్లు.. 2022 ఫిబ్రవరి 8వ తేదీన అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేశారు. అంతకుముందు 2021 మే 25వ తేదీన ఈడీ రూ.50 లక్షలను ప్రొవిజనల్గా అటాచ్ చేసింది. ఈ ఓటుకు నోటు కేసులో అసలు వివాదం రూ.50 లక్షల మొత్తానికి సంబంధించింది కాగా.. ఈ మొత్తాన్ని లంచంగా ఇవ్వబోయినట్లు ఆరోపణలు ఉన్న నగదుకు సమానమైన మొత్తాన్ని ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. అయితే అప్పీలుదారుల తరఫున.. అసలు నగదును ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్వాధీనం చేసుకుని.. ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేసిందని వాదించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 5(1)(బీ)లోని నిబంధనలను ట్రైబ్యునల్ పరిశీలించింది.